Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

పరదేవతా స్వరూపులు
చిలుకూరి పాపయ్యశాస్త్రి

శ్రీ మాత పరదేవత, శ్రీమాత నద్వైతభావనతో భావించు సుకృతులు, పరదేవతా స్వరూపులు, అట్టివారు సకలదేవతా స్వరూపులు, శ్రీ మచ్ఛంకరభగవత్పాదులు పరదేవతా స్వరూపులను విషయము పరతత్త్వమును తెలియగోరు వారికి జిజ్ఞాసావస్థలోనే భాసించును. జ్ఞానులయిన వారి కిట్టి అనుభూతి కలుగుననుటలో సంశయము లేదు. ''శంకర శ్శంకర స్సాక్షా ద్వ్యాసో నారాయణో హరిః '' అనగా శంకరాచార్యులవారు సాక్షాత్తుశంకర స్వరూపులు. వ్యాస భగవానులు విష్ణుస్వరూపులు, అను నీ ఆర్యోక్తిని బట్టి ఆదిశంకరులు పరమేశ్వర మూర్తులే యనునది తద్భక్తులందరకు సువిదితమే. శ్రీ మచ్ఛంకరభగవత్పాద విరచిత వివిధ దేవతా స్తోత్రములను ఏ కొంచమైనా, శ్రద్ధాభక్తులతో మననము చేయువారుండిన వారి హృదయములకీ విషయము విదితము, కాకమానదు. శ్రీ వారు శివానందలహరిలోగానీ, సౌందర్యలహరిలోగాని, పార్వతీపరమేశ్వర స్తుతులను, సుతులను, సతులను గావించిన తావు లందలి యాక్రందనము లన్నియు సంసారసాగర నిమగ్నులైన ప్రాణుల నుద్ధరించుటకు, ఆర్తరక్షణమునకు ననుట నిర్వివాదమైన విషయము.

8-22

శంకరవిభూతి శంకరభగవత్పాదులందు సంపన్నమై యుండె ననుటకు తద్విరచిత స్తుతులతో తన్ముఖోద్గత వాక్యసమన్వయమే నిదర్శనము, శివానందలహరిలోని ఈ క్రింది శ్లోకమును పరికింతము.

యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయః ప్రదో ద్యోగినో

దృష్టాదృష్ట మతోపదేశ కృతినో బాహ్యాంతర వ్యాపినః |

సర్వజ్ఞస్య దయామయస్య భవతః కిం వేదితవ్యం మయా

శంభో త్వం పరమాం తరంగ ఇతి మే చిత్తే స్మరామ్య న్వహమ్‌||

శంభూ ! నీవు భక్తుల యోగక్షేమ భారమును వహించినవాడవు అందరకు శ్రేయస్సును కలుగజేయుట కుద్యమంచువాడవు. కనబడునవి, కనబడనివి అయిన మతముల నుపదేశించుటలో నేర్పరివి, లేక అట్టి మతముల నుపదేశించుటయే పనిగాగలవాడవు బయటను లోపలను నిండియున్న వాడవు. సర్వమూ తెలిసినవాడవు, దయానిధివి, అయిన నీకు నేనేమి తెలుపవలెను. నీవు పరమాంతరంగుడవని అనుదినము నాచిత్తములో నిన్ను స్మరించుచున్నాను. అని ఈ శ్లోకభావము, శంకర భగవత్పాదు లీ శివానందలహరిలో వారి దివ్యానుభూతిని వివరించి యున్నారు. దానితోపాటు పరమేశ్వర విభూతిని బహుముఖముల భక్తానుసంధాన యోగ్యము గావించియున్నారు. ఆదిశంకరుల వాగమృతధారల్లో నాప్లవము చేయగలవారున్న వారికి పై శ్లోకవిషయమంతయు వారిలోనే సమన్వితమగును. వారిలోనేగాదు, శంకరభగవత్పాదులు ప్రతిష్టించిన సర్వజ్ఞ పీఠాధిష్టాతలయిన శ్రీ చరణు లందరియందు నట్టి శంకరవిభూతి స్పష్టముగా గోచరించుచునే యుండును

ఆంధ్రభూమియందు జన్మించిన ప్రాణుల సుకృతపరిపాకముచే ఈ పుణ్యభూమిని తమపాదరజస్పర్శచే పవిత్రతరము చేయుటకై సంచరించుచు, తాము అవగాహనము చేసిన జలాశయములను పుణ్య తీర్థములుగను, తాము వసించిన ప్రదేశములను దివ్యక్షేత్రములుగను జేయుచు, యావత్ర్పాణి సమూహమునకు దర్శనము ప్రసాదించుచు, అనుగ్రహించుచున్న శ్రీ మజ్జగద్గురు కాంచీకామకోటి పీఠాధీశ్వరులయిన శ్రీ మచ్చంద్ర శేఖరేంద్ర సరస్వతీ శ్రీ చరణులందును, శ్రీ మజ్జయేంద్ర సరస్వతీ శ్రీ చరణులందును, పై శ్లోకమందు నిరూపిత మయిన శంకరదివ్యవిభూతి సుస్థిరమై యున్నది. శ్రీ వారలు తమ్ము భక్తితో దర్శించువారికి, స్మరించువారికి యోగక్షేమముల భారమును వహించుటకై యుందురు. తమ్ము దర్శింపవచ్చు వారినందరినీ ఆనందకళా సంభరితమైన మాటలతో యోగక్షేమ పరిప్రశ్నము చేయుచు వచ్చినవారి నందరినీ ఆనందపరిపూర్ణ హృదయములను గావింతురు. వారిని దర్శించి తిరిగి వచ్చువారందరూ ఆనందమయములై మరలుదురు.

శ్రీ వారలు చేయు ప్రతిస్పందము చరాచర ప్రపంచమునకు సకల శ్రేయస్సులూ కలిగించుటకే యగుచుండును. వారి సదుపదేశములోని ప్రత్యక్షరమును ప్రాణులందరకు శ్రేయస్సును (అత్యంతిక సుఖమును) కలిగించుటకు ఉద్యుక్తమై యుండును. బ్రహ్మాండ మంతయు స్వస్వరూపముగా భావించుయోగీంద్రుల యుద్యోగ మెప్పుడు నట్టులే యుండు ననుట. అట్టి భావనగలవారికే విదితము. శ్రీ వారల చరణసన్నిధి నుండి భగవద్భాగవత విషయక చర్చ ప్రసక్తమైనపుడు తన్ముఖారవిందమునుండి సకలమతములు తత్త లక్ష్యములు ఉపదేశరూపమున బహిర్గతములగుచునే యుండును, భగవత్స్వరూపులయిన వారి దివ్యదృష్టికి విదితము కానిదేదియు నుండబోదు. అక్షరస్వరూపాను సంధానముచే వాణీ విలాసము నందు వారి చిత్తమున కందని దేదియు నుండడు.

వాజ్ఞయమందలి గద్యపద్యరూపమై సకల భాషా ప్రపంచము వారికి కరతలామలకమై యుండును. కావుననే శ్రీవారు ప్రపంచభాష అన్నిటిలోనూ ప్రసంగము చేయుటయేకాక, అక్షరాస్యుల కందరకు సదుపదేశము చేయనుద్యమించి, వారిని కృతార్థులను చేయుదురు.

''యా వర్ణపద వాక్యార్థ గద్యపద్య స్వరూపిణి,

వాచి నర్తయతు క్షి ప్ర సా మాం మేధాసరస్వతీ.''

అని పరదేవతను ప్రార్థించు శ్రీ వారలకు అవిదితమేదియు నుండబోదని కొంచె మెరిగిన వారికైనను తెలియుచుండును. శ్రీ వారలలో సర్వజ్ఞత్వము అందరకు గోచరించుచునే యుండును. వారి సన్నిధినుండెడి యే ప్రాణిహృదయమునందెట్టి సంకల్పము గలదో అది వారికి ఆగంతకుడు తెలుపకుండగనే విదిత మగచుండును. శ్రీవారలను భక్తితో దర్శింపవచ్చిన వారి యార్తిననుసరించి శ్రీవారి దయ వారి వారిపై ప్రసరించి, వారివారికి ప్రత్యేక దర్శన భాషణ భాగ్యములు లభించు చుండును. శ్రీవారలకు గల దయ అపారము, ఏ ప్రాణి దేనిని గోరినను దానిని వారికి దయతో ప్రసాదించుచునే యుండును. ఎవరి కేది ఈయదగునో, సర్వజ్ఞు లయిన శ్రీవారల కది ముందుగనే విదితమయి, వారివారికి పరదేవతాస్వరూపులయిన క్షవారలు వాంఛాధిక సమృద్ధుల నొసగు చుందురు. సర్వజ్ఞలయి సర్వవ్యాపకులై పరమేశ్వర స్వరూపులయిన వారికి ఎవ్వరు నేదియు తెలుపనక్కరలేదు. భౌతిక సమృద్దికై ప్రాకులాడుచు శ్రీవారలను దర్శింపవచ్చిన వారికి తమదర్శన, భాషణ ప్రసాదములచే సకలార్తి హరులగు చుండగా, ఆధ్యాత్మిక సంపత్సమృద్ధికై తద్దర్శన సేవాభాషణ భాగ్యముల నభిలషించెడి జనులకు, దయానిధులయిన శ్రీవారల నుండి లభించు భాగ్య మనిర్వచనీయము. ఈ విధముగా పర్యాలోచనము చేయునప్పుడు జగద్గురువులు చంద్రశేఖర స్వరూపులనుటకు సర్వదా సర్వథా తథ్యము.

''య స్సర్వజ్ఞః సర్వవిత్‌ యస్య జ్ఞానమయం తపః'' అను ఉపనిషద్వాక్యముచే జ్ఞానమును తప స్సంపన్నులు సర్వవేత్తలయి యుండుట సహజము. శ్రీవార లట్టిజ్ఞాన మయ తప స్సంపన్నులో, నిప్పటివారిలో నగ్రగణ్యులు, గావున వారిలో సర్వజ్ఞత మేర్పడియుండుట సహజము, వారు పరదేవతాస్వరూపులై ప్రపంచమంతటిని స్వస్వరూపముగానే భావించుచు సకల లోక శ్రేయః ప్రజోద్యోగము చేయుచునే యుందురు. భారతదేశమునకు ప్రక్కనున్న పాకిస్తానులో చెలరేగిన యుద్ధాగ్నిజ్వాలలను చల్లార్చుట యావత్ర్పపంచ క్షేమకరమైన విషయము. భారతవీరులకు విజయము లభించినపుడు గాని అసమరాగ్ని జ్వాల చల్లారదు. అట్టి విజయమును భారతీయవీరులకు సమకూర్చుటకు యావద్భారతము సుభిక్షమై యుండుటకు, ప్రపంచశాంతి యేర్పడుటకు శ్రీవారలు తాము తపస్సు చేసి, దేశమందంతటను పరమేశ్వరా రాధనము చేయించి, భారతవీరులకు విజయసాధనముగ తేనేనభిమంత్రించి, దానిని బంగారు పాత్రలోనుంచి, యుద్ధభూమి యందగ్రేసరులై ఆ తంత్రమును నడిపించెడి వారికి (మేజర్స్‌) బుద్ధిపాటవ మేర్పడుటకై ప్రసాదముగా స్వీకరింప బంపినారు, ఆ పాత్రను తమసన్నిహితుల చేత రణభూమికి బంపివారిచే గ్రహింపజేసినారు. ఇంతకంటే సకలలోక శ్రేయస్సంపాదకమైన ఉద్యమము వేరొకటి యుండునా? ఇది పరమేశ్వర విభూతిగాక మరేమి? శ్రీవారల యీవిధ మయిన అనుగ్రహము భారతదేశ విజయసాధక మగుటయేగాక, ప్రపంచశాంతి సంపాదక మయిన తాష్కెంటు సమావేశము సఫలమగుటకు నిదానమైనది. శ్రీవారలు పరదేవతా స్వరూపులనుటకు, పరమేశ్వరవిభూతి వారిలో సంపన్నమై యున్నదనుటకు ఇంతకంటే నిదర్శన మేమి కావలయును?

శ్రీవార లపరశంకరావతారులనుటకు, శ్రీశైలమును వారు దర్శించినపుడు సామాన్య మానవులకు కూడా బోధపడునిదర్శనములు కొన్ని తటస్థించినవి. శ్రీశైలము శ్రీ దేవతా వాసము. అచట శ్రీ శంకరభగవత్పాదులు పరదేవత నారాధించి సాక్షాత్కారమందిన చోటు, శ్రీవారు హటకేశ్వర సమీపమున 27 మెట్లున్న లోయలోని గుహలో యోగసాధనచేసి సమాధి నిష్ఠులై యున్న యావాసముగలదు. అది శ్రీవారికి విదితమై ఆ తావునకు స్వయముగా పాదచారులైపోయి, అచట ఆకులతో కప్పబడియున్న లింగమూర్తిని వెలికిదీసి యభిషేకించి, ఆ గుహలోనే శ్రీవారలు సమాధిస్థితులై యుండి, యోగతారావళి శ్రీ శంకరభగవత్పాద విరచిత మగుటకు శ్రీవారు నిదర్శనము నుపదేశించియున్నారు. అపరశంకరస్వరూపులు గనుక శ్రీవారలు వానిని తెలిపినారు. అటులనే త్రిపురాంతకమున తుప్పలలో కప్పబడియున్న శ్రీ చంద్రమౌళీశ్వరుని బయటబెట్టి దేవున కభిషేకాదికమును నిర్వర్తించి, ఆ దేవతామూర్తి అచట అంతర్గతమై యున్న సంగతిని లోకమున కెరిగించినారు. శ్రీ శంకరభగవత్పాద హృదయమును సమగ్రముగా తెలుసుకొని, ప్రత్యక్షరము నందు వారిహృదయము నావిష్కరించుచు, వైదిక ధర్మము నుద్ధరించుటకై యవ తరించిన శ్రీ మత్కాంచీకామకోటి పీఠాధీశ్వరులు సాక్షాచ్ఛంకరస్వరూపులనుటకు విప్రతి పత్తి యుండబోదు, శ్రీవారలు జగజ్జననీ స్వరూపులు.

లోకాస్సమస్తా స్సుఖినో భవంతు


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page